Friday, July 17, 2015

సెక్షన్‌ ఎనిమిదీ, సమాఖ్య స్ఫూర్తీరాజ్యాంగంలో, చట్టంలో తమకు అనుకూలంగా ఉన్న వాటిని ఒప్పుకుంటామని, లేకపోతే దాని అమలును ఒప్పుకునేది లేదనే ఒక కొత్త సంస్కృతికి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెరలేపింది.

ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌ పాత్ర, అధికారాల గురించి విభజన చట్టంలోని సెక్షన్‌ 8 విస్పష్టంగా వివరిస్తే, శాంతిభద్రతల నిర్వహణ అధికారం తమదేనని తెలంగాణప్రభుత్వం ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చింది. ఏడాది తర్వాత, భారత అటార్నీజనరల్‌ సెక్షన్‌ 8 మీద వివ రణ ఇస్తే, ఇప్పుడు ఈ సెక్షన్‌ చెల్లదని, ఒప్పుకునేది లేదని, తెలంగాణ భగ్గుమంటుందని, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెరాసప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇది రాజ్యాంగవిరుద్ధమని ఒకాయన అంటే, సెక్షన్‌ 8ని చింపి పారేస్తామని మరొక నాయకుడంటాడు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికే ఈ సెక్షన్‌ విఘాతం కలిగిస్తుందని మరొక మేధావి ఉద్ఘాటిస్తాడు. రాష్ర్టాల హక్కులేం కావాలని వేరొ కాయన వాపోతాడు. అసలు సెక్షన్‌ 8 ని అమలుచేయాల్సిన అవసరం ఏముందని, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని మరొకాయన సెలవిస్తాడు. ఆంధ్రావాళ్లు పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని మరొక ప్రొఫెసర్‌ హెచ్చరిస్తాడు.

ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, తెలంగాణలో పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది మేధావులు, మరికొన్ని సంఘాల వాదన పరస్పర విరుద్ధంగా, చట్టాన్ని అపహాస్యం చేసేవిధంగా, బెదిరింపు ధోరణిలో ఉంది. దీనికి సంబంధించి తెరాస నాయకులు, మద్దతుదారులు చేసే వాదనలు ఎంత పసలేనివో, ఎంత పక్కదారి పట్టించేవో, ఎందుకు చెల్లుబాటు కావో కొంచెం విశ్లేషిస్తే సామాన్యులకు కూడా తెలిసిపోతుంది. 
  • ఏ చట్టం ద్వారా అయితే విభజన జరిగిందో, ఏ చట్టం ద్వారా అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో, ఆ చట్టం - ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2014 - లోని సెక్షన్‌ 8ని మాత్రం మేం ఒప్పుకోం. 

ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల అభీష్టానికి వ్యతిరే కంగా ఈ చట్టాన్ని రూపొందించిన విషయమూ, ఈ చట్టం ప్రకారమే అవశేష ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన అంశమూ అందరికీ తెలుసు. ఇప్పుడు రెండుప్రశ్నలు - ఒకటి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా, విభజన చట్టాన్ని రూపొం దించారు కాబట్టి, విభజన చెల్లుబాటు కాకుండా పోతుందా? రెండు, పార్లమెంటు ఆమోదించిన ఏదైనా చట్టంలో అను కూలంగా ఉండే అంశాలను అమలుచేసి, అననుకూలంగా ఉన్నవాటిని కాదనే వెసులుబాటు భారత రాజ్యాంగవ్యవస్థలో ఉందా? మాకు రాజ్యాంగమంతా ఓకే, కానీ ఆర్టికల్‌ మూడును మాత్రం మేం అంగీకరించం అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గానీ, ప్రజలు గానీ వాదులాడే అవకాశం ఏమైనా ఉందా?
  • సెక్షన్‌ 8 రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది రాష్ర్టాల హక్కులను కాలరాయడమే.   

ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ద్వారా వ్యతిరేకించిన విభ జనను కేంద్రం ఏకపక్షంగా చేపట్టినప్పుడు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగలేదు! ఇరు ప్రాంతాల మధ్య సమస్యలను పరిష్కరించి, సామరస్యంగా విభజన వ్యవహారాన్ని నడప కుండా, కేకును కోసినట్టు రాష్ర్టాన్ని ఢిల్లీ పెద్దలు రెండు ముక్కలు చేసినప్పుడు సమాఖ్య సెంటి మెంటు గుర్తుకు రాలేదు! ఆయా ప్రాంత ప్రజల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, ఏ రాష్ర్టాన్నయినా, ఎన్ని ముక్కలైనా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అధికారాలు దఖలు పరుచుకుంటే, సమా ఖ్యకు ఇబ్బందేమీ లేదు! కానీ ఒక రాష్ట్ర రాజధానిలో, రెండు ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, అక్కడి శాంతిభద్రతల వ్యవ హారం కేంద్రప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్‌ చేతిలో (ఒక తాత్కాలిక కాల పరిమితితో) ఉంటే మాత్రం సమాఖ్య స్ఫూర్తి కుప్పకూలిపోతుంది!! ఇది అవకాశవాదానికి పరాకాష్ట కాదా?
  • సెక్షన్‌ 8 అనేది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. హైదరాబాద్‌లో ఆంధ్రా పెత్తనాన్ని సహించేది లేదు. 

రాజ్యాంగ వ్యవస్థలకు, చట్టసభలకు ప్రాతిపదిక రాజ్యాంగమూ, చట్టమే గానీ, ఆత్మగౌరవం కాదు. రాష్ట్ర విభజనతో, అది జరిగిన తీరుతో మా ఆత్మగౌరవం దెబ్బ తిన్నది గాబట్టి, మేం ఇక కేంద్ర చట్టాలను పాటించం అని గానీ, కేజీ బేసిన్‌లో గ్యాస్‌ వంటి వనరుల మీద కేంద్ర ఆధిపత్యాన్ని ఒప్పుకోం అనిగానీ వాదించే హక్కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉంటుందా?

ఇక సెక్షన్‌ 8 కింద హైదరాబాద్‌లో శాంతి భద్రతల పర్య వేక్షణ అధికారాలు ఉండేది కేంద్ర ప్రతినిధీ, అలాగే తెరాస ఇటీవల ప్రత్యేక అభిమానం పెంచుకున్న గవర్నర్‌కే గానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి గానీ, ఆ ముఖ్యమంత్రికి గానీ కాదు. గవర్నర్‌ సాధారణంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు, అవసరమైనప్పుడు మాత్రమే తన విచక్షణ ప్రకారం వ్యవహరించాలని సెక్షన్‌ 8 చెబుతోంది. దీనికి విపరీ తార్థాలు తీసి, ఆంధ్రప్రదేశ్‌ కేదో హైదరాబాద్‌ మీద అధికా రాలు ఇచ్చినట్టు వక్రభాష్యం చెప్పడం ఎందుకు? మధ్యలో ఓ పెద్ద మనిషి ఉంటాడన్నందుకే అంత ఉలుకుందెకు? 
  • ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలవాళ్లు బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టాల్లో మాకు అధికారాలు కావాలంటే ఎవరైనా ఒప్పుకుంటారా? అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

ఆ కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తీరుకు హస్తిమశకాంతం తేడా ఉందనే విషయం కేసీఆర్‌కి తెలియదని ఎవరూ అనుకోరు. మా ప్రాంతం మాకు రాష్ట్రంగా కావాలి అని డిమాండ్‌ చేసి, సాధించుకున్న ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలు దేనికోసం లక్నో, పాట్నా గురించి మాట్లాడతాయి? బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టాలకు రాయపూర్‌, రాంచీలతో పనేముంది? ఉమ్మడిరాష్ట్ర రాజధానిగా 60 ఏళ్లు ఉన్న ప్రాంతం విడిపోవాలని కోరుకున్నప్పుడు, ఆరు దశాబ్దాల పాటు అల్లుకున్న చిక్కుముడులని ఒక్కసారే విడదీయడం సాధ్యమయ్యేపనేనా? హైదరాబాద్‌లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చినవారు ఎంతమంది? లక్నో, పాట్నాల్లో బతికే ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వాసులు ఎంత మంది? ఈ లెక్కలు తెలియని అమాయకులేం కాదు తెరాస నాయకులు! ఇక ఫ్రాయిడియన్‌ స్లిప్‌ అంటారే, అది కేసీఆర్‌ మాటల్లో బయటపడింది. తెలంగాణ- బీహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రమైతే, తల్లి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ మాత్రం అక్కడ విడిపోయిన ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రమని కేసీఆరే అంటున్నారు. 
  • హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. గవర్నర్‌ ఎందుకు జోక్యం చేసుకోవాలి?

ఇది ఎలా ఉందంటే, ప్రస్తుతం యుద్ధాలు లేవు కాబట్టి, సైన్యాన్ని రద్దు చేయండి అన్నట్టు. సెక్షన్‌ 8 అనేది ఒక ప్రత్యేక కాలపరిమితికి లోబడి అమలయ్యే చట్టం. పదేళ్ల తర్వాత నిజంగానే తెరాస వారు మళ్లీ అధికార పగ్గాలు చేపట్టి, ఆంధ్రావాళ్ల మీద అరాచకాలు చేసినా, ఈ చట్టంగానీ, గవర్నర్‌ గానీ ఏమీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎందు కంటే, అప్పటికి సెక్షన్‌ 8కి కాలం చెల్లుతుంది కాబట్టి. ఇదేదో సర్వకాల సర్వావస్థలందూ తెలంగాణ నెత్తిన పెట్టిన గుది బండ అన్నట్టు తెరాస చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు.

ఇక, విభజన తర్వాత హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రజల మీద తెలంగాణ ప్రజలెవరూ దాడులు చేయలేదనేది వాస్తవం. వాళ్ల ఆస్తులు, ప్రాణాలకు ఎవరూ ముప్పుతేలేదు. తెలంగాణ ప్రజలకు అటువంటి చరిత్ర, సంస్కృతి లేదు. కానీ, తెరాస ప్రభుత్వం వేరు, తెలంగాణ ప్రజలు వేరు. విభేదాలు, వైషమ్యాలే రాజకీయ పెట్టుబడిగా ఎదిగి, అధికారాన్ని అందుకున్న తెరాస నాయకత్వం, ప్రభుత్వాన్ని ఏర్పరిచిన వెంటనే చేపట్టిన కార్యక్రమాలు అందరికీ తెలుసు. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను గుర్తించడానికి చేసిన యత్నాలు, ఆస్తుల పంపకాల వ్యవహారాల్లో గొడవలని ఆయా ప్రాం తాల, ప్రాంత ప్రజల వ్యవహారంగా చిత్రీకరించిన తీరు, ఆంధ్రా ఉద్యోగుల పట్ల ఇప్పటికీ అవలంబిస్తున్న వైఖరి ఇవేవీ ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం మీద హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావారికి నమ్మకం, విశ్వాసం కలిగించేవిగా లేవు.

మొత్తంగా చూస్తే, హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రాంత ప్రజల మీద నేరుగా చెప్పుకోదగ్గ వివక్ష ప్రదర్శించిన దాఖలాలు కనిపించవు. అయితే, తెరాస ప్రభుత్వం తన వ్యవహారశైలి ద్వారా హైదరాబాద్‌లో నివసించే కోస్తా, రాయలసీమ ప్రజల్లో ఒక రకమైన మానసిక భయాందోళ నలు కలిగించిన మాట మాత్రం వాస్తవం. భావోద్వేగాల మీద ఆధారపడి రాజకీయాలు చేసే పార్టీలున్నప్పుడు, మంట ఎప్పుడు అంటుకుంటుందో ఎవరూ చెప్పలేరు. ఇటు వంటి పరిణామాలని గుర్తించే, సెక్షన్‌ 8ని పొందుపరిచారు.
  •  ఏసీబీ కేసు కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెక్షన్‌ 8 పాట అందుకొంది.

ఇది నిజం కావచ్చు. కానీ, పార్లమెంటులో ఆమోదం పొందిన ఒక చట్టం అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్దేశాలతో నిమిత్తం లేదు. అసలు 2014 జూన్‌ నుంచే సెక్షన్‌8 అమలుకు ఆంధ్రప్రదేశ్‌ పట్టుపట్ట లేదని కొందరు విమర్శిస్తే, తొందరపడి ఈ చట్టం గురించి గొడవ చేస్తే, కొత్తగా ఏర్పడ్డ రాష్ర్టాల మధ్య విభేదాలు మరింత రాజు కుంటాయనే అభిప్రాయం కూడా వెల్లడయిన అంశాన్ని గుర్తుంచుకోవాలి.

  • రాజ్యాంగం ప్రకారం అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానివే. ఈ అధికారాలను లాగేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం.

ఇదెలా ఉందంటే, రాజ్యాంగం ప్రకారం ప్రజలంతా చట్టం ముందు సమానులే, అందుకని, రిజర్వేషన్లు చెల్లవు అనడం లాంటిది! ఇంతకంటే అర్థరహిత వాదన మరొకటి ఉండదు. రాజ్యాంగం ప్రకారం, శాంతిభద్రతల పర్యవేక్షణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ, తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌లు పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉనికిలోకి వచ్చాయి. కొత్త రాష్ర్టాలు నిలదొక్కుకోవడానికి, ఇరు రాష్ర్టాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వాటిలో సెక్షన్‌ 8 ఒకటి. విభజన చట్టం సమ్మతమైనప్పుడు, అందులోని అన్ని సెక్షన్లకి అంగీకారం ఉండాలి. లేదా, అటువంటి చట్టాన్నే నిరాకరించాలి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా, రాష్ట్ర అధికారాలను కేంద్రం లాక్కుంటోందని కాసేపూ, అంధ్రా వాళ్లు పెత్తనం చేస్తున్నారని కాసేపూ మాట్లాడటం మసిపూసి మారేడుకాయ చేయడమే. ఈ మాత్రం చట్టం, దాని నిర్వచనం సాక్షాత్తూ అటార్నీ జనరల్‌ అంతటి వాడికి కూడా తెలియదన్నట్టుగా తెరాస నాయకులు, మద్దతునిచ్చే మేధోవర్గం మాట్లాడటం విచిత్రం!

సెక్షన్‌ 8ని ఏ ప్రభుత్వమైనా రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకోవడం ఇరు రాష్ర్టాలకు శ్రేయస్కరం కాదు. కేంద్రం, గవర్నర్‌ తలుచుకుంటే ఈ సెక్షన్‌కి సంబంధించి రెండు ప్రభుత్వాలకు నచ్చజెప్పి, ఇరువురికీ ఆమోద యోగ్యంగా అమలుచేయడం కష్టం కాదు. తెలంగాణ ప్రభు త్వం తలుచుకోవాలే గానీ, సెక్షన్‌ 8 అధికారాలు ఇచ్చినా, గవర్నర్‌ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా, సామరస్యంగా వ్యవహారాన్ని నడిపే అవకాశం పూర్తిగా ఉంది. అయితే, రాజకీయంగా బోలెడంత ముడిసరుకు లభ్యంగా ఉన్నప్పుడు, రాజకీయ నాయకులు వదులుకుంటారా అనేదే ప్రశ్న.

(Published in Andhra Jyothy on 24-06-2015)

No comments:

Post a Comment