Saturday, July 18, 2015

జ‌ర్నలిజపు ప్రమాద‌క‌ర పార్శ్వం

టంక‌శాల అశోక్ అనే జ‌ర్నలిస్టుకి మేధావిగా చాలా గుర్తింపు ఉంది. అనేకానేక ప‌త్రిక‌ల్లో చేసిన అనుభవం, దానికంటే, రాష్ట్ర విభజన డిమాండ్ కు అనుకూలంగా ఆంధ్ర అనే ప‌దాన్ని అన్ని ర‌కాల దుర్మార్గాల‌కు ప్రతీక‌గా చిత్రీక‌రించ‌డంలో ఆయ‌న చేసిన కృషి అంద‌రికి సుప‌రిచితం. ఇందుకు గుర్తింపుగా ఆయ‌న‌కు అనేక స‌న్మానాలు, స‌త్కారాలు కూడా జ‌రిగాయి.

ఇంత‌ ఆరితేరిన జర్నలిస్టు ఏదైనా రాస్తే, ఎంతో అధ్యయ‌నంతో, అవ‌గాహ‌న‌తో, నిష్పాక్షిక‌త‌తో ఆ రాత ఉంటుంద‌ని మ‌నబోటి సామాన్యులు త‌లుస్తారు. ఆయ‌న త‌ల‌పండిన‌వాడు గ‌నుక‌, ఆయ‌న రాసిన విష‌యాలు స‌త్యసంధ‌త‌కు మారుపేరుగా, ఆయ‌న విశ్లేష‌ణ‌లు తార్కిక‌వాదానికి సోదాహ‌ర‌ణ‌లుగా నిలుస్తాయ‌ని న‌మ్ముతారు.

కాని, కొంచెం లోతుకు వెళ్లి, ఈయ‌న రాత‌ల‌ను చ‌ద‌వండి. వాటిల్లోని డొల్లత‌న‌మూ, వ‌క్రీక‌ర‌ణా, లేకిత‌న‌మూ మనల్ని నిశ్చేష్ఠులను చేస్తాయి.

వికీలీక్స్ వ్యవ‌హారంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర గురించి ఈయ‌న‌ న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో ``ఫెడ‌ర‌లిజ‌పు ప్రమాద‌క‌ర పార్శ్వం`` అనే అనే శీర్షికతో విమ‌ర్శనాత్మక‌ వ్యాసం రాశారు.  అస‌లు మ‌న‌దేశానికి ఫెడ‌ర‌లిజం (స‌మాఖ్య వ్యవ‌స్థ‌) అనే భావ‌నే పెనుప్రమాదంగా మారింద‌ని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ అని కూడా సెల‌విచ్చారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టిన  ఈ అంశం మీద త‌ర్వాత మాట్లాడ‌దాం.

స‌మాఖ్య వ్యవస్థే దేశానికి మంచిది కాదేమో అనేంత నేరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? ఇందుకు సంబంధించి వికీ లీక్స్ లో ఏం బ‌య‌ట‌ప‌డింది?

``ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ప‌రిక‌రాలు `అత్యవ‌స‌రంగా` కావాల‌ని హాకింగ్ టీం అనే కంపెనీ హైద‌రాబాద్ ప్రతినిధిని తొంద‌ర‌పెట్టింది. త‌న ఫోన్ ట్యాపింగ్ అయింద‌ని చంద్రబాబు ఆరోపించిందే త‌డ‌వు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాపింగ్ ప‌రిక‌రాలు కొనుగోలు చేయ‌డానికి `వేగంగా` ప్రయ‌త్నించింది. అయితే, ఈ ప్రయ‌త్నాలు వికీలీక్స్ లో బ‌య‌ట‌పడేస‌రికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగ‌లాగా దొరికిపోయింది.  ఈ ఆరోప‌ణ‌లు (?) వ‌స్తే, వీటి మీద విచార‌ణ కూడా జ‌రిపించ‌డం లేదు. దీంతో, ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద నేరం చేసిన‌ట్టు మ‌న‌కు స్పష్టమ‌వుతోంది. స‌మాఖ్య వ్యవ‌స్థ ఇచ్చిన అలుసు కార‌ణంగానే, రాష్ట్రాలు ఇలా స్వతంత్రంగా వ్వహ‌రిస్తున్నాయి. ఆర్థిక సంస్కర‌ణ‌లు వ‌ల్ల కూడా రాష్ట్రాలు రెచ్చిపోతున్నాయి. దీనిని వెంట‌నే క‌ట్టడి చేయ‌క‌పోతే, దేశ స‌మైక్యత‌కే భంగం .``

ఇదీ ఆయ‌న వ్యాసంలోని సారాంశం. నేతిబీర‌కాయంలో నేయి ఎంత ఉంటుందో, ఈయ‌న రాసిన ఈ సొంత పైత్యంలో అంతే నిజమూ, అంతే నిష్పాక్షికత ఉంది.

మొద‌టి సంగ‌తి, ఈయ‌న వికీలీక్స్ లో వెల్లడైన ప‌త్రాల‌ను స‌మ‌గ్రంగా చ‌ద‌వ‌లేదు. చ‌ద‌వ‌డానికి ప్రయ‌త్నించిన దాఖ‌లా ఈ వ్యాసంలోనైతే లేదు.   తాను వ్యాసం రాసిన ప‌త్రిక‌లో వ‌చ్చిన వంక‌ర స‌మాచారమే ఈయ‌న‌కు ప్రాతిప‌దిక‌. అందులో రాసిన‌ అర్థ స‌త్యాల‌ను, అబ‌ద్ధాల‌ను, చెప్పని నిజాల‌ను ఆధారం చేసుకొని రాసిన‌దీ వ్యాసం.

ఇంత‌కీ వికీలీక్స్ ద్వారా వెల్లడైన విష‌యాలు ఏమిటి?
  1. 2014 జ‌న‌వ‌రిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమ్ కో ఇండియా ద్వారా హ్యాకింగ్ టీం సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసింది.
  2.  ఆంధ్రప్రదేశ్ తో పాటు, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్, మ‌హారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు కూడా హ్యాకింగ్ టీం సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారు.
  3.  ఇదే స‌మ‌యంలో కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియ‌ట్ కు, కేంద్ర ఇంట‌లిజెన్స్ విభాగానికి కూడా ఈ సాఫ్ట్ వేర్ ను అమ్మజూపారు.
  4.  వీటితో పాటు, రీసెర్చి అండ్ ఎనాల‌సిస్ వింగ్, నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ, ఇంట‌లిజెన్స్ బ్యూరో (ఐబి), నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రీసెర్చి ఆర్గనైజేష‌న్ - వీరంద‌రికి ఇట‌లీకి చెందిన హ్యాకింగ్ టీం కంపెనీ, నిఘా వ్యవస్థల పైన 2014 జ‌న‌వ‌రి లో వెబినార్ నిర్వహించింది.
  5.  2014 న‌వంబ‌రులో ప‌శ్చిమ బెంగాల్ ప్రభుత్వం త‌ర‌ఫున యాంటీ టెర్రరిస్ట్ సెల్ నిఘా ప‌రిక‌రాల కొనుగోలుకు ఇదే కంపెనీకి ఈమెయిల్ ద్వారా స‌మాచారం కోరింది. 
  6. - 2015 జూన్ లో సెల్యుల‌ర్ నిఘా వ్యవ‌స్థకు సంబంధించిన వివ‌రాల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయ‌త్నించింది.
ఇవీ, వికీలీక్స్ వెల్లడించిన మొత్తం విష‌యాలు.
  • ఇందులో మొద‌టి పాయింటు, 2014 జ‌న‌వ‌రిలో హ్యాకింగ్ టీం సాఫ్ట్ వేర్ ను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్న విష‌యం టంక‌శాల గారి వికీలీక్స్ ప‌త్రాల్లో మ‌రుగున ప‌డిపోయిందా?
  • లేక, విభ‌నానంత‌ర‌ ఆంధ్రప్రదేశ్ ని మాత్రమే టార్గెట్ చేయాల‌నే దురుద్దేశంతో, ఈ నిజాన్ని దాచిపెట్టారా?
  • ఈ కొన్న హ్యాకింగ్ టీం నిఘా సాఫ్ట్ వేర్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఎవ‌రి ద‌గ్గర ఉంది? 
  •  తెలంగాణ ప్రభుత్వం ద‌గ్గర ఉంటే, ఎవ‌రి మీద నిఘా కోసం ఈ సాఫ్ట్ వేర్ ను  వినియోగించారో చెప్పాల‌ని డిమాండ్ చేయాల్సిన అవ‌సరం మ‌న మేధావికి లేదా? 
  • ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలోని చాలా సంస్థలు హ్యాకింగ్ టీం ప్రతినిధుల‌తో ఉత్తర‌ప్రత్యుత్తరాలు జ‌రిపాయ‌న్న విష‌యాన్ని ఎందుకు మ‌రుగుప‌ర్చారు?
  • విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ నిఘా ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుకోవ‌డాన‌కి ప్రయ‌త్నించ‌డం ఎలా నేర‌మైంది?
  •  తెలంగాణ ప్రభుత్వానికి, ఇత‌ర రాష్ట్ర ప్రభుత్వాల‌కు మాత్రం ఫోన్ ట్యాపింగ్, నిఘా ప‌రికరాలు ఉండ‌వ‌చ్చుగాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఈ అధికారం, అవ‌స‌రం లేద‌ని ఏ ప్రాతిప‌దిక‌న టంక‌శాల చెబుతున్నారు?
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఈ ప‌రిక‌రాల‌ను కొన‌లేద‌నే వాస్తవాన్ని ఎందుకు దాచిపెట్టారు?
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, ఏపి పోలీసులు గానీ రాసినట్టుగా ఏ ఈమెయిలూ, లేఖా వికీ లీక్స్ లో బ‌య‌ట‌ప‌డ‌లేదు. కాసు ప్రభాక‌ర్ అనే వ్యక్తి, త‌మ కంపెనీకి రాసిన లేఖ‌లో, ఏపి పోలీసుల కోసం వివ‌రాలు కావాల‌ని ఈమెయిల్ ఇవ్వడం మిన‌హా, ఇందులో ఏపి పోలీసులు నేరుగా ఎవ‌రినైనా సంప్రదించిన‌ట్టుగానీ, లేఖ రాసిన‌ట్టుగానీ ఆధారం లేదన్న విష‌యాన్ని దాట‌వేయ‌డం క‌రెక్టేనా?
  •  ఏపి పోలీసులు నిఘా ప‌రికరాల‌ని కొన్నట్టుగానీ, హ్యాకింగ్ టీంతో నేరుగా మాట్లాడిన‌ట్టుగానీ వికీలీక్స్ లో ప్రస్తావ‌నే లేన‌ప్పుడు, ఈ మొత్త వ్వవ‌హారం మీద దేనికోసం విచార‌ణ జ‌ర‌పాలి?
  • నిఘా ప‌రిక‌రాలు, ఫోన్ ట్యాపింగ్ ప‌రిక‌రాలు ప్రభుత్వం ఉంచుకోవ‌డం ఘోరమూ, నేరమూ, అనైతిక‌మైతే, అప్పటి ఉమ్మడి ప్రభుత్వం తెప్పించుకున్న ఈ ప‌రిక‌రాల‌ను తెలంగాణ ప్రభుత్వం  త‌న అధీనంలో ఉంచుకోవ‌డం అనైతికం కాకుండా ఎలా పోయింది?
  • దేశంలోని అన్నిరాష్ట్ర  ప్రభుత్వాల‌తో పాటు, కేంద్ర సంస్థల‌తో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిఘా ప‌రిక‌రాలు క‌లిగి ఉండాల‌నుకుంటే, అది ప్రత్యేకంగా త‌ప్పు అని ఎందుకు అనిపించింది?
  •  ఫ‌లానా వాళ్లకు నేను మ‌న ఎక్విప్ మెంట్ అమ్ముదామ‌నుకుంటున్నాను, ఈ ప‌రిక‌రాల‌కు సంబంధించి మ‌రిన్న వివ‌రాలు నాకు ఇస్తారా అని  ఎవ‌రో ఒక బ్రోక‌ర్ తన కంపెనీలో  పైవాళ్లకు ఒక ఈమెయిల్ ఇస్తే, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స‌మాధానం చెప్పాలన‌డం అమాయ‌క‌త్వమా, అఙ్ఞాన‌మా?
  • వాస్తవాలు ఇలా ఉంటే,  చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో సంబంధం లేకుండా, డైర‌క్టుగా ఒక ఇటాలియ‌న్ గూఢ‌చారి ప‌రికరాల‌ను కొనేస్తోంది అన‌డం దురుద్దేశ‌పూర్వకంగా వాస్తవాల‌ను వ‌క్రీక‌రించ‌డం, తిమ్మిని బ‌మ్మిని చేయ‌డం కాదా?
  •  ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు సోమ‌లింగం అన్నట్టు, ఏమీ లేని దానికి కేంద్ర ప్రభుత్వ అనుమ‌తి ఉందా లేదా అన్న చెత్త ప్రశ్నలు వేయ‌డం వెన‌క ఉద్దేశం ఏమిటి?
  •  ఒక వేళ కేంద్రం అనుమ‌తి కావాల్సి వ‌స్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేనా, తెలంగాణ‌, ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా అవసరమా? ప‌్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ద‌గ్గర ఉన్న నిఘా ప‌రిక‌రాల‌కు కేంద్రం అనుమ‌తి ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఈయ‌న‌కు ఎందుకు క‌న‌బ‌డ‌లేదు?
  •  అస‌లు కేంద్రం అనుమ‌తి లేకుండా రాష్ట్రం నిఘా ప‌రిక‌రాలు కొన‌గూడ‌ద‌న్న ఈయ‌న సూత్రీక‌ర‌ణ ఏంటి? ఆ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి తెలియ‌దా? కేంద్రప్రభుత్వానికి తెలియ‌కుండానే రాష్ట్రప్రభుత్వాలు వీటిని కొంటున్నాయ‌న్న నిర్థార‌ణ‌కు అస‌లు ఈయ‌న ఎలా వ‌చ్చారు?
  • ఈ లేని బూచిని చూపెట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవ‌హ‌రిస్తున్నాయి, ఇది ఫెడ‌ర‌లిజం ప్రమాద‌క‌ర పార్శ్వం అని సూత్రీక‌రించ‌డ‌మేంటి? ఇంత‌క‌న్నా, లేకి వాద‌న మ‌రొక‌టి ఉంటుందా? 
  •  వికీలీక్స్ పేరుతో అవాకులు చెవాకులు మ‌న‌మే రాసేసి, మ‌న‌మే స‌మాఖ్య వ్యవ‌స్థ వల్ల అన‌ర్థం జ‌రుగుతుంద‌ని ఒక కొత్త థియ‌రీ లేవ‌దీయ‌డం మేధోప‌ర‌మైన దివాలాకోరుత‌నం, అంత‌క‌న్నా కుట్రపూరితం కాదా?
  •  ఆర్థిక సంస్కర‌ణ‌ల వ‌ల్లే రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవ‌హ‌రించే ధోర‌ణి ప్రబ‌లింద‌ని చెప్పడం కంటే హాస్యాస్పదం ఇంకోటి ఉందా? బ‌ల‌మైన కేంద్రం ఉండాల‌ని కోరుకునే బిజెపి వంటి పార్టీలు అధికారంలో ఉండ‌గా, ఇదెలా సాధ్యమ‌న్న శంక మీకు రాలేదా?
  •  అయినా, ప్రాంతీయ పార్టీల వ‌ల్లే ఈ అన‌ర్థం జ‌రుతోందన్న మీ ఆవేద‌న ఆంధ్రప్రదేశ్ కే ప‌రిమిత‌మా, మిగ‌తా రాష్ట్రాల‌కు కూడా ఇది వ‌ర్తిస్తుందా? 
  • వికీలీక్స్ కి సంబంధించి ఆరోప‌ణ‌లు వ‌స్తే (మీరే ఆరోప‌ణ‌లు చేసి, మీరే వ‌చ్చాయ‌ంటారునుకోండి!), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత‌పూర్వకంగా ఖండించ‌లేద‌ని  ప‌చ్చి అబద్ధం ఒక‌టి మ‌ళ్లీ!


ఇంత స‌త్యదూరంగా, వాస్తవాల‌ను ఇంత వ‌క్రీక‌రించి, ఏమాత్రం అధ్యయ‌నం లేకుండా, ఆధారాల్లేని ఆరోప‌ణ‌ల ప్రాతిప‌దిక‌గా ఎడాపెడా రాసేయ‌డం ఏ ప‌రిణ‌తి చెందిన జ‌ర్నలిజానికి ప్రతీక‌! 

1 comment:

  1. నాకెందుకో `ఫెడ‌ర‌లిజ‌పు ప్రమాద‌క‌ర పార్శ్వం`` అనే శీర్షికే నచ్చలేదు. టంకశాల అశోక్ ఫెడ‌ర‌లిజాన్ని తప్పుపట్టాడంటే ఆశ్చర్యంగానూ వుంది.

    ReplyDelete