Friday, July 17, 2015

ఆంధ్రకి ఆగని అన్యాయం

వశేష’ ఆంధ్రప్రదేశ్‌కి ఇవాళ దిక్కూదివాణం లేదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం తగిన బందోబస్తు చేసింది. 
ఎనిమిదిన్నర కోట్ల ప్రజల ఆశల, అవకాశాల కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్‌నూ, దాని నుంచి సింహభాగంగా వచ్చే ఆదాయాన్నీ, విభజన పేరుతో మూడున్నర కోట్ల మందికి కట్టబెట్టడం గురించి కాదు ఈ మాట. 
హైదరాబాద్‌లో ఆంధ్రుల పరిరక్షణ కోసమంటూ, సెక్షన్‌ 8 అనే ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడం గురించి కాదు ఈ నిష్టూరం. చట్టంలో పెట్టలేకపోయాంగాని, పదేళ్ల ప్రత్యేక హోదా ఖాయమని పార్లమెంటు సాక్షిగా అవలీలగా అబద్ధాలు చెప్పడం గురించి కాదు ఈ విమర్శ. 
అరవై ఏళ్ల పాటు అందరి స్వేదంతో నిర్మితమైన వందలాది వ్యవస్థలను కూడా నిస్సిగ్గుగా లాగేసుకుంటే, ఈ పునర్‌ వ్యవస్థీ కరణ చట్టం అక్కరకు రాలేదని కూడా కాదు ఈ ఆక్రోశం. 
ఇంత అనైతికంగా, అన్ని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పరిశేష ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతుంటే, తెలుగువారికున్న ఏకైక మహానగరంలోని మేధావులు గానీ, మార్క్సిస్టులు గానీ, హక్కుల కార్యకర్తలు గానీ, రాజకీయ పార్టీలుగానీ, ప్రొఫెసర్లుగానీ, ఉపన్యాసకులు గానీ - ఒక్కరంటే ఒక్కరు కూడా నోరెత్తి, ఇది అధర్మం అని చెప్పేవారు లేరా అని ఈ ఆవేదన. 
హైదరాబాద్‌ (ఆదాయం) లేదన్నారు సరే. సెక్షన్‌ 8 చెల్లదన్నారు పోనివ్వండి. షెడ్యూల్‌ 10లోని 142 ప్రభుత్వ సంస్థలు కూడా మావేనని బుకాయిస్తే, అందుకు కోర్టు కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలేరితే, ఇక చివరకు మిగిలేదేమిటి?

హైదరాబాద్‌లోని సుపరిపాలనా కేంద్రాన్ని అత్యాధునిక వస తులతో, అధునాతన భవనాల్లో 2001లో అప్పటి ముఖ్యమంత్రి చొరవతో ప్రారంభించారు. పాలనలో కొత్త పంథా అవలంబిం చేందుకు, అందుకు అనుగుణంగా పాలనాయంత్రాంగానికి తర్ఫీదునిచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన ఈ కేంద్రం దేశ విదేశాల్లో పేరు సంపాదించుకుంది. ఉమ్మడిగా ఏర్పరుచున్న ఈ సంస్థ మొత్తం మాదేనని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లాగేసుకుంటోంది. సుపరిపాలనా కేంద్రం వంటి మరి 126 సంస్థలు హైదరాబాద్‌లోనే ఏర్పాటయ్యాయి కాబట్టి, ఇవన్నీ మావేనని తెలంగాణప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్యర్యంలో ఏర్పడిన సంస్థల్లో నూట ఏడింటిని పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్‌-10 కింద పెట్టారు. ఆ తర్వాత కొద్ది కాలానికి (ఈ ఏడాది మే 7న), ఈ జాబితాకి మరో 35 సంస్థలను గుట్టు చప్పుడు కాకుండా కేంద్రం జతచేసింది. అంటే, ఉమ్మడి రాష్ట్రం లోని 142 సంస్థలు ప్రస్తుతం ఈ షెడ్యూల్‌-10 కింద ఉన్నాయి.


అరవై ఏళ్ల పాటు తెలుగువారందరికి రాజధానిగా ఉన్నందు వల్ల, ఈ 142 ప్రభుత్వ సంస్థల్లో 123 సంస్థలని హైదరాబాద్‌ నగరంలోనూ, శివారుల్లోనూ నెలకొల్పారు. అక్షరాలా పదహారు (16) సంస్థలను మాత్రమే, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పెట్టారు. మూడు సంస్థలు హైదరాబాద్‌ బయట తెలంగాణ జిల్లాల్లో ఉన్నాయి. షెడ్యూల్‌-10 కింద హైదరాబాద్‌లో ఉన్నవి చిన్నాచితకా సంస్థలుకావు. విద్యారంగానికి సంబంధించిన అన్ని బోర్డులు, సొసైటీలు ఇందులోనే ఉన్నాయి. తెలుగు, హిందీ, సంస్కృతం అకాడెమిలు ఈ జాబితాలోనివే. జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌, తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం, రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర నుంచి టెక్స్ట్‌ బుక్‌ ప్రెస్‌, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, ఓరియంటల్‌ మాన్యుస్ర్కిప్ట్స్‌ లైబ్రరీ, స్టేట్‌ ఆర్కైవ్స్‌ దీనికిందకే వస్తాయి. సైన్సు, పోలీసు, సర్వే, అటవీ, కనస్ట్రక్షన్‌ మొదలైన అకాడెమిలు, పొల్యూషన్‌ కంట్రోల్‌, బయో డైవర్శిటీ, సోషల్‌ వెల్ఫేర్‌, వక్ఫ్‌ వంటి బోర్డులు, ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళా, బాలల హక్కుల కమిషన్లు ఈ జాబితాలోనివే. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల ప్రజలు కట్టిన పన్నుల నుంచి, అప్పటి మొత్తం రాష్ట్ర జనాభాకి సేవల అందించడం కోసం, ఆరు దశాబ్దాల పాటు, అందరి కృషితో ఏర్పాటైన సంస్థలివి. అరవై ఏళ్ల పాటు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ, అందరూ కలిసి కట్టుకున్న పరిపాలనా వ్యవస్థలివి.

‘కొన్ని రాష్ట్ర స్థాయి ప్రభుత్వసంస్థల సేవలు అందుబాటులో ఉండటం గురించి’ అనే మకుటంతో ఈ షెడ్యూల్‌-10 ఉంది. ఈ షెడ్యూల్‌ గురించి సెక్షన్‌ 75 (1) వివరించింది. ‘ఆయా రాష్ర్టాల్లో ఉన్న ఉమ్మడి రాష్ట్ర సంస్థల సేవలను పొరుగు రాష్ర్టా నికి ఎటువంటి లోటు లేకుండా సమకూర్చాలి. అపాయింటెండ్‌ తేదీ నుంచి (అంటే 2014 జూన్‌2 నుంచి) ఏడాది లోగా దీనికి సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి రావాలి. రాని పక్షంలో, కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలి,’ అనేది ఈ సెక్షన్‌ సారాంశం.

ఈ సెక్షన్‌లో ఎక్కడా సంస్థల యాజమాన్యం (ఒనర్‌ షిప్‌) గురించిన ప్రస్తావన లేదు. అంటే, ఏ రాష్ట్రంలో ఈ సంస్థలు ఉంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఇవన్నీ దఖలు పడతాయని ఈ సెక్షన్‌ చెప్పలేదు. నిజానికి, రెండు రాష్ర్టాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం గురించి చట్టంలోని ఆరో భాగంలోని సెక్షన్‌ వివరించింది. ఆస్తులు, అప్పుల పంపకాలు ‘సముచితంగా, సహేతుకంగా, న్యాయబద్ధం’గా జరగాలని(47.3), ఈ పంపకం జనాభా ప్రాతిపదికన (అంటే 58:42 నిష్పత్తిలో) ఉండాలని (48.1.బి), ఒకవేళ రెండు రాష్ర్టాలు ఈ విషయంలో ఒక అవ గాహనకు రాలేకపోతే, భారత కంట్రోలర్‌అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ సలహా ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యత నిర్వర్తిస్తుందని (47.4) ఈ సెక్షన్‌ స్పష్టం చేసింది. ఈ సెక్షన్‌లో పదే పదే వాడిన పదాలు ‘సముచితంగా, సహేతుకంగా, న్యాయబద్ధంగా’ రెండు రాష్ర్టాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన జరగాలని. అలాగే, సెక్షన్‌ 64 కూడా, ఆస్తులు అప్పులకు సంబంధించి ఇరు రాష్ర్టాలూ ఒక అవగాహనకు వచ్చి పంచుకోవాలని, లేని పక్షంలో కేంద్రం ఆదేశాలప్రకారం నడుచుకోవాలని చెబుతుంది.

అయితే, దబాయిస్తే ఏ మాటైనా చెల్లుబాటు అవుతుందనే వైఖరికి అలవాటుపడ్డ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఈ సంస్థలన్నీ హైదరాబాద్‌లో, అంటే తెలంగాణ భూభాగంలో ఉన్నాయి కాబట్టి, తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయనే వాదన మొదలుపెట్టారు. రాజ్యాంగం ప్రకారం, ఏ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ సంస్థలు ఆ రాష్ర్టానివే కాబట్టి; ఇవాల్టి రోజున ఈ ప్రాంతం భౌగోళికంగా తెలంగాణకాబట్టి, ఈ సంస్థలన్నిటినీ మేం కలిపేసుకుంటున్నాం అని తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉన్నత విద్యామండలి కేసులో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా ఉండటంతో, తెలంగాణ ప్రభుత్వం ఇక అన్నీ తమవేననే ధీమాతో ముందుకు వెళు తోంది. హైదరాబాద్‌లో ఉన్న అన్ని షెడ్యూల్‌-10 సంస్థలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాలు కూడా జారీ చేశారు. నిజానికి, అంతకుముందే ఏపీ ప్రభుత్వం వేసిన అప్పీలుకు స్పందించిన సుప్రీం కోర్టు, ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి హైదరాబాద్‌లో తన కార్యకలా పాలు నిర్వహించవచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని మీద తుది తీర్పు సుప్రీం కోర్టు వెలువరించాల్సి ఉంది.

కేసు ఫలితం ఏమైనా కావచ్చు. కాని, ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాస్వామ్యవాదులమని చొక్కాలు చించుకునే వారికీ, ప్రజల హక్కులు మీదా, న్యాయాన్యాయాల మీద మాట్లాడే పేటెంట్‌ మాదేనని చెప్పుకునే మేధావివర్గానికీ, హక్కుల సంఘాలకూ ఎదురయ్యే ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఆరుదశాబ్దాల ఉమ్మడి కష్టాన్ని ఒక్కరే తన్నుకు పోతామనడం న్యాయమేనా? మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజలకు జరగాల్సిన న్యాయం, ఐదు కోట్ల ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు అవసరం లేదా? చట్టం, రాజ్యాంగం ఏం చెప్పిందని అలా ఉంచితే, సహజ న్యాయసూత్రాలు, సామరస్య పంపకాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదా? స్థానబలం ఉందికదాని, నీతి న్యాయాలను వదిలేసి, ఆటవిక ధర్మాన్ని పాటించడాన్ని ఖండించాల్సిన అవసరం లేదా? చట్ట ప్రకారం చూసినా కూడా ఈ 142 సంస్థలకు సంబంధించి ఏడాది లోగా రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన కుదరని పక్షంలో, కేంద్రమే పంపకాలు చేయాల్సి ఉంది. ఆ సమయం ముగిసింది కూడా. కేంద్రం నిర్ణయం తర్వాతే కోర్టుల జోక్యం ఉండొచ్చు. ఆ రకంగా చూసినా, ఉన్నత విద్యామండలి కేసులో హైకోర్టు తీర్పును అడ్డంపెట్టుకొని, అన్ని సంస్థలను ఏకపక్షంగా మావేనని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం చట్టాన్ని వక్రీకరించడం కాదా? పోనీ వీటిలో కొన్నిటిని తెలంగాణకు బదలాయించి, ఆ మేరకు నష్టపరిహారం చెల్లించినా సరేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేఖ రాస్తే, కేంద్రం ఇంతవరకూ కిమ్మనకపోవడం సబబేనా?

తెలంగాణ ప్రభుత్వ వైఖరి పదో షెడ్యూల్‌ విషయంలో ఏ రకంగా చూసినా కూడా సమర్థనీయం కాదు. సెక్షన్‌ ఎనిమిది గురించో, హైదరాబాద్‌ గురించో మాట్లాడితే తెలంగాణ ఆత్మగౌరవమూ, రాష్ర్టాల హక్కులూ అని ఉపన్యాసాలు దంచే మేధావులు, షెడ్యూల్‌-10లోని ఉమ్మడి సంస్థలు, ఆస్తుల గురించి భరించలేని మౌనమెందుకు వహిస్తారో తెలియదు.

కారణలేమైనా, కోస్తా, రాయలసీమ ప్రజలను అన్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుంటే, ఇవాళ ప్రశ్నించే గొంతుకలేలేవు. సూది మొనంత భూమి కూడా ఇవ్వనని నిక్కచ్చిగా చెప్పిన ధుర్యోధనుడి మాదిరిగానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మాట్లా డుతుంటే, ఈ వైఖరి అనర్థదాయకం అని చెప్పగల కురు వృద్ధులు, గురువృద్ధులు తెలుగు రాష్ర్టాల్లో లేకుండా పోయారు!                                                              
(Published in Andhra Jyothy on 11-07-2015)

No comments:

Post a Comment